ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అంతా సిద్ధం..ఏక్ షామ్-చార్మినార్ కే నామ్.

అంతా సిద్ధం..ఏక్ షామ్-చార్మినార్ కే నామ్.
  • పాతబస్తీలో నెలకు రెండు సార్లు.. 
  • చార్మినార్ చెంత ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు..
  • ఇప్పటికే తగిన ఏర్పాట్లు..
  • ఈనెల 17 నుంచి ప్రారంభం..
  • ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు..
  • ఉచిత పార్కింగ్ కు సిద్ధం..

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 16(హైదరాబాద్): ఈ ఆదివారం నుంచి చార్మినార్ లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి చార్మినార్ లో నిర్వహించనున్న ఏక్ షామ్ చార్మినార్ కే నామ్.. అనే కార్యక్రమం సందర్భంగా ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిహెచ్ఎంసి అధికారులతో పాటు పోలీస్ అధికారులు ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించారని అన్నారు. శనివారం మిలాద్ ఉన్ నబి ఉత్సవాలను పురస్కరించుకొని సాలార్జంగ్ మ్యూజియంలో ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన కో-ఆర్డినేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏక్ షామ్ చార్మినార్ కె నామ్.. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే వాహనదారుల సౌకర్యార్థం చార్మినార్ పరిసరాలలో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలోని ఉత్తర మూసి నది ప్రాంతాల నుంచి పాతబస్తీకి వచ్చే వాహనదారులు అందరూ తమ వాహనాలను ఖుడా స్టేడియం, పత్తర్ గట్టి లోని ఎస్ వై జే కాంప్లెక్స్, కోట్ల అలీజా లోని ముఫిదుల్లా నామ్ పాఠశాల ప్రాంగణం, జిహెచ్ఎంసి చార్మినార్ సర్దార్ మహాల్ భవనం ప్రాంగణం, చార్మినార్ యునాని ఆసుపత్రి ప్రాంగణం, చార్మినార్ పాత బస్టాండ్ ఖాళీ స్థలం లతో పాటు మోతీగల్లి లోని ఓల్డ్ పెన్షన్ పేమెంట్ కార్యాలయ ప్రాంగణం లలో వాహనదారుల సౌకర్యార్థం ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మొదటి రోజు కార్యక్రమం సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ప్రజలందరినీ ఆకట్టుకోనుందన్నారు. నెలలో రెండు ఆదివారాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని..ఇందులో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నగర ట్రాఫిక్ డిసిపి కరుణాకర్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ట్యాంక్ బండ్ లో కొనసాగుతున్న సండే ఫన్ డే కార్యక్రమానికి నగర ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని..ఈ నేపథ్యంలోనే చార్మినార్ వద్ద కూడా ఏక్ షామ్ చార్మినార్ కె నామ్.. అనే పేరుతో సండే ఫన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లో నగర ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులతో పాల్గొని కాసేపు సరదాగా కాలక్షేపం చేయాలని నగర పోలీసు కమిషనర్ కోరారు.

ట్యాంక్ బండ్లో లాగే…

ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై కొనసాగుతున్న “సండే – ఫన్ డే” కార్యక్రమం లాగే పాతబస్తీ చార్మినార్ లో కూడా కొనసాగించడానికి అధికారులు అంతా సిద్దం చేశారు. గత కొన్ని రోజులుగా వెహికల్ ఫ్రీ జోన్ గా కొనసాగిస్తున్న.. అధికారులు ప్రజలు కాస్సేపు సరదాగా సంతోషంగా గడపడానికి ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై  సండే ఫన్ డే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా ట్యాంక్బండ్ పై గడపడానికి అవకాశం కలిగింది. ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎలాంటి వాహనాలను అనుమతించ కుండా కేవలం ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో ప్రతి ఆదివారం సాయంత్రం నగర ప్రజలు ట్యాంక్బండ్ పై సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో చార్మినార్ లో కూడా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చార్మినార్ లో కూడా సండే ఫన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వివరించారు. దీంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ముందుకు వచ్చి తగిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈనెల 14న, ఉదయం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అరవింద్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, నగర ట్రాఫిక్ డిసిపి కరుణాకర్, దక్షిణ మండలం డిసిపి డాక్టర్ గజరావు భూపాల్, జిహెచ్ఎంసి చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ రాములు నాయక్ తదితరులు చార్మినార్లో పర్యటించారు.చార్మినార్ నలువైపులా ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రానైట్ రోడ్డులో కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే విషయాన్ని అధికారుల బృందం తేల్చింది. ఈనెల 17వ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. చార్మినార్ వద్ద నిర్వహించే ఈ కార్యక్రమం సందర్భంగా పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ముషాయిరా, ఖవ్వాలీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించనున్నారు. చార్మినార్ లో వారం విడిచి వారం నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు.  ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే వారందరి సౌకర్యార్థం పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉచిత పార్కింగ్ సౌకర్యం చార్మినార్ పరిసరాల్లోనే ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలతో పాటు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ఇప్పటికే తగిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆదివారం నుంచి చార్మినార్ లో నిర్వహించే కార్యక్ర మానికి ప్రజల నుంచి స్పందన వస్తే రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలతో కార్యక్రమాలను రూపొందించనున్నారు.