areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఆకాశంలో నెల వంక కనిపిస్తే..10 నుంచి మొహర్రం సంతాప దినాలు

ఆకాశంలోనెల వంక కనిపిస్తే..10 నుంచి మొహర్రం సంతాప దినాలు
  • 68 రోజుల పాటు కొనసాగనున్న సంతాప దినాలు
  • ఇందుకోసం నగరంలోని అన్ని ఆషుర్ ఖానాలలో ఏర్పాట్లు షురూ..
  • 19న, పాతబస్తీ వీధుల్లో బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు..
  • తగిన బందోబస్తు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ వెల్లడి
  • మొహర్రంను పురస్కరించుకుని శుక్రవారం సాలార్ జంగ్ మ్యూజియంలో సమీక్షా సమావేశం.

ఆర్సీ న్యూస్,ఆగస్టు 6 (హైదరాబాద్): రాబోయే మొహర్రం సంతాపదినాలను పురస్కరించుకొని శుక్రవారం సాలార్జంగ్ మ్యూజియంలో సమీక్ష సమావేశం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, జిహెచ్ఎంసి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. సంబంధిత అధికారులతో పాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది మొహరం సంతాపదినాలు పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆషుర్ ఖానా లలో మజ్లిస్,మాతం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ సంస్మరణార్ధం నిర్వహించే మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని అరవై ఎనిమిది రోజుల పాటు మజ్లిస్, మాతం జరుగుతుంది. షియా ముస్లిం ప్రజలు నల్లటి దుస్తులు ధరించి ప్రతిరోజు మజ్లీస్, మాతంలో పాల్గొంటారు. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా మొహర్రం సంతాప దినాలు పూర్తిగా కొనసాగినప్పటికీ… పదవ మొహర్రం సందర్భంగా నిర్వహించే బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపును జన సందోహం ఎక్కువగా లేకుండానే కొనసాగించారు. అయితే ఈసారి  ఎలాంటి కరోనా ఆంక్షలు లేకపోవడంతో బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాలార్జంగ్ మ్యూజియంలో మొహరం ఏర్పాట్లపై కో-ఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హాజరయ్యారు. ఈనెల 9వ తేదీన ఆకాశంలో నెలవంక కనిపిస్తే..10వ తేదీ నుంచి మొహరం సంతాపదినాలు ప్రారంభం కానున్నాయని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. పదవ తేదీ నుంచి ఒకటో మొహరం ప్రారంభం అవుతుందని అంటున్నారు. పదవ తేదీన మొహరం సంతాప దినాలు ప్రారంభమైతే…ఈనెల 19వ తేదీన డబీర్ పురా బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు కొనసాగనుంది. డబీర్పురా లోని బీబీ కా అలావా నుంచి ప్రారంభమయ్యే బీబీ కా ఆలం ఊరేగింపు డబీర్పురా దర్వాజా, యాకుత్ పురా దర్వాజా, కోట్ల అలీజా, చార్మినార్, గుల్జార్ హౌజ్, పత్తర్ గట్టి, మదీనా మీదుగా చాదర్ ఘాట్ వరకు కొనసాగనుంది మొహరం సంతాపదినాలు ప్రారంభమవుతున్నందున ఏర్పాటు చేసిన కో- ఆర్డినేషన్ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ముస్లిం మత పెద్దలు పలు సలహాలు సూచనలు చేశారు. హైదరాబాద్ నగరం అంటే… మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని.. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరన్నారు. ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తున్న హైదరాబాద్ నగరంలో మొహరం లాంటి సంతాపదినాల కార్యక్రమాలు చక్కగా కొనసాగుతాయన్నారు. గతేడాది దేశంలో ఎక్కడ మొహరం సంతాపదినాల సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు జరగనప్పటికీ… హైదరాబాద్ నగరంలో బీబీ కా ఆలం ఊరేగింపు కొనసాగిందన్నారు. ఏనుగు పై బీబి కా ఆలం ఊరేగింపు కొనసాగుతున్నందున గల్లీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటూనే మజ్లిస్, మాతం నిర్వహించాలన్నారు. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో తగిన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని పనులు పోలీసుల పైనే వదిలేయకుండా నిర్వాహకులతో పాటు షియా ముస్లిం ప్రజలు సైతం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అందరి సహాయ సహకారాలతో మొహరం పదవ రోజును పురస్కరించుకొని నిర్వహించే బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగియడానికి వీలు పడుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న షియా ముస్లిం మత పెద్దలు నగర పోలీస్ కమిషనర్ కు పలు సూచనలు చేశారు. సంతాపదినాలు ప్రారంభానికి ముందే అన్ని ఆషుర్ ఖానాల వద్ద అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, నగర అదనపు పోలీసు కమిషనర్లు శిఖా గోయల్, డీ.ఎస్ చౌహాన్, డాక్టర్ గజరావు భూపాల్, రమేష్, అనిల్ కుమార్ లతో పాటు యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ భాషా ఖాద్రి, ఎమ్మెల్సీ రియాజుల్ హసన్ హాఫంది, మౌలానా వహీద్ ఉద్దీన్ హైదర్ జాఫ్రీ, నజఫ్ అలీ షౌకత్, మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ తదితరులు పాల్గొన్నారు.