areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కన్నుల పండువగా లాల్ దర్వాజ అమ్మవారికి చివరి బంగారు బోనం..

జొగిని నిషా క్రాంతి లాల్ దర్వాజ బంగారు బోనం తలపై పెట్టుకుని నిమ్మకాయలు నోట్లో పెట్టుకుని కోరుకుతూ చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
  • లాల్ దర్వాజ చౌరస్తా నుంచి సింహవాహిణి దేవాలయం వరకు సామూహిక ఊరేగింపు
  • సింహవాహిణి దేవాలయంలో పూజల అనంతరం బంగారు బోనం సమర్పణ..
  • భాజాభజంత్రీల నడుమ, పోతురాజుల న్రుత్యాలతో కొనసాగిన సామూహిక ఊరేగింపు
  • విజయవాడ అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు,సారె సమర్పణ

 

ఆర్సీ న్యూస్, జూలై 30 (హైదరాబాద్): సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం లాల్ దర్వాజ సింహవాహిణి అమ్మవారికి భక్తులు బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని లాల్ దర్వాజకు ఊరేగింపుగా బయలు దేరారు. దారి పొడవునా నృత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజ చౌరస్తా నుంచి లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయం వరకు పెద్ద ఎత్తున సామూహిక ఊరేగింపు నిర్వహించారు. బంగారు బోనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాజాభజంత్రీల నడుమ, పోతురాజుల నృత్యాలతో సామూహిక ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేధ్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు. జొగిని నిషా క్రాంతి బంగారు బోనం తలపై పెట్టుకుని నిమ్మకాయలు నోట్లో పెట్టుకుని కోరుకుతూ చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు కొనసాగించారు.ఈ సందర్బంగా ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ మాట్లాడుతూ…సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడుగురు అమ్మవార్లకు ఏడు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మొదటి బంగారు బోనంగా గోల్కోండ జగదాంబ అమ్మవారికి.. రెండో బోనంగా బల్కంపేట అమ్మవారికి.. మూడో బోనంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, నాలుగవ బోనంగా విజయవాడలో కనక దుర్గమ్మ తల్లికి,ఐదో బోనం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. ఆరో బోనంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి సమర్పించామన్నారు. ఇక చివరి బంగారు బోనమైన ఏడో బోనం లాల్ దర్వాజ సింహవాహిణీ అమ్మవారికి సమర్పించామన్నారు. బంగారు బోనం ఊరేగింపు, సమర్పణ సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా వైరస్ కట్టడి చర్యలు పాటిస్తూనే బంగారు బోనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 

విజయవాడ కనక దుర్గ దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు, సారె సమర్పణ..

ఇక,శుక్రవారం సాయంత్రం విజయవాడ కనక దుర్గమ్మ తల్లి దేవస్థానం తరఫున ఆలయ ఈవో భ్రమరాంబ, ఆలయ కమిటి చైర్మన్ పైలా స్వామినాయిడుతో పాటు బోర్డు మెంబర్లు పాతబస్తీలోని ప్రధాన అమ్మవారి దేవాలయాలను సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు,సారే సమర్పించారు. ముందుగా లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయంను సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు,సారే అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉప్పుగూడ,గౌలిపురా,సుల్తాన్ షాహీ, బేలా చందులాల్, హరిబౌలి, మీరాలంమండి దేవాలయాలను సందర్శించి పట్టు వస్త్రాలను అందజేశారు. 

ఆగస్టు 1న, అమ్మవారికి బోనాల సమర్ఫనకు అన్ని ఏర్పాట్లు పూర్తి…

ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పాతబస్తీలో గతేడాది కరోనా  వైరస్ కారణంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిరాడంబరంగా కొనసాగింది. భక్తుల హడావుడి లేకుండా మూసి నది వరకు కొనసాగిన ఊరేగింపు సాదా సీదాగా జరిగింది. ఈసారి అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.  అలాగే ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25న పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరిగింది. ఆగస్టు 2న కళాకారుల ఆటలతో పోతురాజుల విన్యాసాలతో సామూహిక ఊరేగింపు కొనసాగనుంది.