areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నిందితుడు ఎక్కడున్నాడు..సీసీ ఫుటేజీలే పట్టిస్తాయా..?

. నిందితుడు రాజు కోసం పోలీసుల ముమ్మర తనిఖీలు..
. వైట్నర్ మత్తులో నిందితుడు..
. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వైట్నర్ బాధితులు..
. వైట్నర్ బాధితులను గుర్తించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది..
. ఇప్పటికే ఎల్బీనగర్లో బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు..
. వైన్ షాపుల వద్ద మఫ్టీలో పోలీసుల నిఘా..
. నిందితుడు రాజును పట్టుకుంటామంటున్న పోలీసులు..

ఆర్సీ న్యూస్, సెప్టెంబర్ 15 ( హైదరాబాద్): సింగరేణి కాలనీ సంఘటన లోని నిందితుడు రాజును పట్టుకోవడానికి పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎప్పుడు మత్తులో కనిపించే రాజును పట్టుకోవడానికి పోలీసుల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వైట్నర్, గంజాయి, డ్రగ్స్, మత్తు కలిగించే కల్లుకు అలవాటుపడిన రాజు.. ఎప్పుడు మత్తులో ఉంటాడని పోలీసుల విచారణలో తేలింది. ఇదిలావుండగా.. నగరంలో వైట్ నర్ వాడే నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైట్నర్ మత్తులో తాము ఏం చేస్తున్నాం..అనే విషయాన్ని కూడా తెలుసుకోలేని మత్తులో మునిగితేలుతున్నారు. అనాధలైన చిన్నారులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్న పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలకు చెందిన యువకులు సైతం వైట్నర్ బానిసలుగా మారారు. వైట్నర్ మత్తులో తాము విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. గతంలో పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఓ సైంటిస్ట్ పై బ్లేడ్తో ఓ వైట్నర్ దాడికి పాల్పడి గాయాలకు గురి గురిచేశాడు. మరో సంఘటనలో ఓ మీడియా ప్రతినిధి పై వైట్నర్ మత్తులో ఉన్న యువకుడు మక్కా మసీదు వద్ద రాయితో దాడికి పాల్పడ్డాడు.. ఇలా చిన్నారులు, యువకులు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. సింగరేణి కాలనీ లో జరిగిన సంఘటన లో నిందితుడు రాజు సైతం రోజు వైట్నర్ మత్తులో ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. నగరంలో వైట్నర్ వాడే వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎంతమంది వైట్నర్ కు బానిస అయ్యారూ…అనే సమాచారాన్ని సేకరించి ఆయా వైట్నర్ బాధితులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. దీనికితోడు సింగరేణి కాలనీ లో విచ్చలవిడిగా అందుబాటులో ఉండే మత్తు పదార్థాలను అరికట్టాల్సిన అవసరముందంటున్నారు. ఇక.. ఇంతకీ నిందితుడు వారం రోజులైనా పోలీసుల కంటపడకుండా ఎక్కడ ఉన్నాడు..? ఎక్కడ మకాం వేశాడు..? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు..? అతని వెంట ఎవరెవరున్నారు..? ఏం చేస్తున్నాడు..? రోజువారీ దినచర్య ఏమిటి..? అనే అంశాలపై పోలీసులు నిఘా పెట్టారు. గత వారం రోజులుగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిందితుని ఆచూకీ తో పాటు పట్టి ఇస్తే 10 లక్షల రూపాయలు నజరానాగా పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో పోలీసులు నిందితుడు రాజు కోసం జల్లెడ పడుతున్నారు. అతడి కోసం భారీగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లకు రాజు ఫొటో పంపించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. విపక్షాలు విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగింది. ఘటన జరిగి వారం రోజులైనా..నిందితుడు రాజును అరెస్ట్‌ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ సంబందిత పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డితో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారనే విషయాన్ని గట్టిగా చెప్పారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకోవాలనీ ఆదేశించారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు.
డీజీపీ మహేందర్‌ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రాజు ఫొటోను డిస్ ప్లే చేయాలని ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఇక జంట నగరాల పరిధిలో గల్లీగల్లీని గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు రాజు ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సులో వెళ్లిన రాజు ఎక్కడ దిగారో తెలుసుకుంటున్నారు. వేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను చూస్తున్నారు. టవల్‌తో పాటు టోపీని రాజు మోత్కూరు మార్గంలో పడేసినట్లు గుర్తించారు. ఒక కవర్‌లో తువ్వాలు, టోపీ, కల్లు సీసా, రూ.700 నగదు ఉన్నట్లు తేలింది. రాజుకు మద్యం అలవాటు ఉండడంతో అన్నీ వైన్‌షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నగరంతో పాటు సరిహద్దు జిల్లాల్లో రాజు కోసం గాలిస్తున్నారు. నిందితుడు రాజు ఫొటోలను బస్సులు, ఆటోలకు వాల్ పోస్టర్లు అంటించారు. మరికొన్ని చోట్ల నిందితుడి ఫొటో చూపిస్తూ మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రాజు ఆనవాళ్లు లభ్యం అయితే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల వాహనదారులను ఆపివేసి తనిఖీలు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో నిందితుడు రాజును పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు.