areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పూర్తిగా తగ్గని కోవిడ్.. ఇంకా జాగ్రత్తలు అవసరం: అసదుద్దీన్

పూర్తిగా తగ్గని కోవిడ్.. ఇంకా జాగ్రత్తలు అవసరం: అసదుద్దీన్
  • వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగు వేయవద్దు..
  • ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న వారంతా రెండో డోస్ తీసుకోవాలి..
  • రెండో డోస్ తీసుకోని వారు పాతబస్తీ లోనే అధికం..
  • నిర్లక్ష్యం చేస్తే తమతో పాటు ఇతరులకు హాని..
  • ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉచితంగా వాక్సినేషన్..
  • కలందర్ నగర్లో లో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎంపీ..

ఆర్సీ న్యూస్, నవంబర్ 24 (హైదరాబాద్): కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గలేదని.. యూరప్, రష్యాలలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కొంత మంది కోవిడ్ పూర్తిగా తగ్గిపోయిందని..తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. ఇది సరైంది కాదనీ ఆయన హితవు పలికారు. కోవిడ్ పూర్తిగా తగ్గ లేదని… అక్కడక్కడ కేసులు ఇంకా వెలుగుచూస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. కోవిడ్ నుంచి తమను తాము రక్షించుకోవడంతో పాటు సమాజంలోని ఇతరులను కూడా రక్షించడానికి వ్యాక్సినేషన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదన్నారు. ప్రభుత్వం తరపు నుంచి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలియగానే తాను స్వయంగా సెంటర్ కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్నానన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం.. సంతోష్ నగర్ లోని కలందర్ నగర్లో ఆయన బుధవారం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 25.60 లక్షలకుపైగా మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఇందులో 21.50 లక్షలకుపైగా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. ఇంకా నాలుగు లక్షల వరకు రెండోసారి వ్యాక్సిన్ తీసుకునేవారున్నారు. ఇందులో దాదాపు మూడున్నర లక్షల వరకు రెండో డోస్ తీసుకునేవారు పాతబస్తీలోనే ఉన్నారన్నారు. పాతబస్తీ లోని చార్మినార్,సైదాబాద్,బండ్లగూడ, బహదూర్ పురా తదితర మండలాలలో ప్రజలు రెండో డోస్ తీసుకోవాల్సి ఉందన్నారు. వీరంతా వెంటనే రెండో డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంబంధిత ఆశా వర్కర్లు తమ ఇంటి వద్దకు వచ్చి వివరాలు సేకరిస్తున్నారనీ..ఆయా బస్తీల లోనే వ్యాక్సిన్ వేయడానికి సంబంధిత వైద్య అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ జరిగిన నేపథ్యంలో ఆక్సిజన్ కొరతతో పాటు ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయని..మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా లేకపోయినప్పటికీ.. పూర్తిగా తగ్గలేదన్నారు. అక్కడక్కడ కరోనా వైరస్ కేసులు నమోదవుతూ.. మృత్యువాత పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. రష్యాలో రోజుకు ఏడు వందలకు పైగా కరోనా వైరస్ తో మరణిస్తున్నారన్నారు. ఆస్ట్రియా, జర్మనీలో కేసులు పెరుగుతున్నాయన్నారు. 18 ఏళ్లకు పైబడిన వారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, హృద్రోగం లతో బాధపడేవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తాము వినియోగిస్తున్న టెలిఫోన్ నెంబర్ ను అందజేయాలని..తప్పుడు సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వరాదని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో యాకుత్పురా శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, జిహెచ్ఎంసి చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.