areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సెప్టెంబర్ ఏక్ తారీఖ్ సే ఖుల్లా…

ఏక్ తారీఖ్ సే విద్యా సంస్థలు ఖుల్లా...
  • కేజీ టు పీజీ.. స్టార్ట్
  • సెఫ్టెంబర్ 1వ, తేదీ నుంచి విధ్యా సంస్థలు పునఃప్రారంభం
  •  ఇక నుంచి ఆన్లైన్ క్లాసులు లేవు.
  •  జీవో 46 ప్రకారం.. మాత్రమే ఫీజులు వసూలు
  •  కరోనా కట్టడికి చర్యలు
  •  జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు..

 

ఆర్సీ న్యూస్, ఆగస్టు 24 (హైదరాబాద్): గత ఒకటిన్నర సంవత్సరాలుగా విద్యా సంస్థలు మూత పడడంతో విద్యార్థుల మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలను పునఃప్రారంభించడానికి నిశ్చయించింది. ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రగతి భవన్ లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలన్నీ పనిచేయాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థల అన్నింటిని పునః ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో పాటు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలన్నీ పనిచేసేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసులకు అవకాశం ఇవ్వద్దని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారని.. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు కలెక్టర్లను ఆదేశించారు. విద్యాలయాల్లో విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆగస్టు 30వ, తేదీ లోపు రాష్ట్రంలోని అన్ని పాఠశాలను శుభ్రం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు అందజేయాలన్నారు. నాణ్యమైన భోజనం అందజేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. భోజన ఏర్పాట్ల సందర్భంగా విద్యార్థుల నడుమ భౌతిక దూరం పాటించేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పాఠశాలను ఒక్కో క్లస్టర్ గా భావిస్తూ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏఎన్ఎం అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ.. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించేటట్లు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త వహించాలన్నారు. మాస్క్ లతో పాటు శానిటైజర్ సైతం వాడేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలలో మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రతి విద్యార్థి స్కూల్కు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల విషయంలో తమ ఇష్టానుసారంగా వసూలు చేయడానికి వీలు లేదన్నారు. జీవో నెంబర్ 46 ప్రకారం ఫీజులు మాత్రమే వసూలు చేసేటట్లు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు మంత్రులు తెలిపారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు విద్యాసంస్థలు మూతపడడంతో విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని.. అందుకే విద్యాసంస్థల పునః ప్రారంభానికి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందన్నారు. ఆయా పాఠశాలల పరిధిలో పారిశుధ్యంపై బాధ్యతలను సంబంధిత కార్పొరేటర్లు, మేయర్, సర్పంచులు పర్యవేక్షించాల్సిన అవసరముందన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు సంబంధిత విద్యా శాఖ డి ఈ ఓ  అప్రమత్తంగా ఉండి పరిస్థితిని అంచనా వేయాలన్నారు. ఎక్కడైనా విద్యార్థులకు జలుబు, జ్వరం వచ్చినట్లయితే వెంటనే కరోనా వైరస్ పరీక్షలు చేయించి తమ తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత డి ఈ ఓ లదే నన్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ట్రాన్స్ పోర్ట్ విషయంలో తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనా కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలలో యాజమాన్యాలపై ఉందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు అన్ని పని చేస్తున్నందున ఇకనుంచి ఆన్లైన్ క్లాసులు ఉండవన్నారు.