ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఆంధ్రలో తెలంగాణ బోనాలకు ఏర్పాట్లు షురూ..

ఆంధ్రలో తెలంగాణ బోనాలకు ఏర్పాట్లు షురూ..

 

  • ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావును కలిసి వినతి
  • బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానం
  • ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కావాలని మంత్రికి వినతి
  • ఈ నెల 18న,విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనం
  • భాజా భజంత్రీలు, పోతురాజుల నృత్య విన్యాసాలతో బోనాల ఊరేగింపు
  • 2010 నుంచి విజయవాడలో తెలంగాణ బోనాలు.

ఆర్సీ న్యూస్,జులై 2 (హైదరాబాద్): రాబోయే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2010 నుంచి పాతబస్తీకి చెందిన ఉత్సవాల నిర్వాహకులు ప్రతి ఆషాడ మాసంలో విజయవాడ కనక దుర్గ అమ్మవారికి భక్తిశ్రద్దలతో బంగారు బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో జరిగే విజయవాడ బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరుగుతాయి. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి తెలంగాణ భక్కులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా ఈసారి బంగారు బోనాన్ని ఈ నెల 18న నిర్వహించడానికి కమిటి సిద్దమయ్యింది. సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా 18వ తేదీన విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ఒక రోజు ముందుగా అంటే..ఈ నెల 17న, ఉత్సవాల నిర్వాహకులు,భక్తులు కళాకారులు,పోతు రాజులతో కలిసి పాతబస్తీ నుంచి బయలు దేరి విజయవాడ చేరుకుంటారు. విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి కళాకారుల నృత్యాలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు నిర్వహిస్తారు. రాబోయే ఉత్సవాలను పురస్కరించుకుని ఊరేగింపు కమిటి  అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృదం గురువారం సాయంత్రం విజయవాడ వెళ్లింది. శుక్రవారం ఉదయం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావును కలిసి విజయవాడలో నిర్వహించే తెలంగాణ ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలపై చర్చించింది. బోనాల ఊరేగింపుకు అవసరమైన తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈసారి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిని కోరినట్లు  కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్, ప్రదాన కార్యదర్శి మధుసూదన్ యాదవ్ మాజీ అధ్యక్షులు గాజుల అంజయ్య, జనగామ మధుసూదన్ గౌడ్, బంగారు మైసమ్మ దేవాలయం కమిటి అధ్యక్షులు అనంతోజు హంసరాజ్ తదితరులు తెలిపారు. తమ వినతి మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. అలాగే ఏఫీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా బోనాల జాతర ఉత్సవాలలో ముఖ్య అతిథిగా హాజరు అయ్యేటట్లు చూడాలని తాము మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావును కోరామన్నారు. అలాగే ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ దేవాలయం ఈవో,ఆలయ కమిటి చైర్మన్ లతో పాటు విజయవాడ పోలీసు కమిషనర్, ఏపీ సాంసృతిక శాఖ డైరెక్టర్ లను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు, అలాగే ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30న, పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలకు విజయవాడ కనక దుర్గ అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరినట్లు వారు తెలిపారు. ప్రతి ఆషాడ మాసం సందర్బంగా అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తొందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న,నగరానికి పట్టు వస్త్రాలు తీసుకురావడానికి దేవాలయం ఈవో తమ అంగీకారం తెలిపా రన్నారు. ఇక,నగరంలో జూలై 11వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నా యన్నారు. జూలై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ.. అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు ఉంటుందన్నారు. ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగుతుందన్నారు. ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయన్నారు.