areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఇక మరింత పటిష్టంగా లాక్ డౌన్ అమలు.

ఇక మరింత పటిష్టంగా ల

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయనున్నారు. అత్యవసర పనులు లేకున్నా..అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఇక నుంచి కట్టడి చేయనున్నారు. సరైన అనుమతి పత్రాలు లేకుండా ఏదో ఒక కారణం చెబుతూ రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటుందనే విషయాన్ని పోలీసు బాస్ లు గుర్తించారు. క్షేత్ర స్థాయి నుంచి అందిన నివేదిక ఆదారంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి లాక్ డౌన్ అమలు పట్ల మరింత పకడ్బందీగా వ్యవహరించాలని ఆయన ఐజీలు, డీఐజీలు,పోలీసు కమీషనర్లు, ఎస్పీలు,ఏసీపీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనసరంగా రాకపోకలు సాగించే వాహనాలను కట్టడి చేయడంలో భాగంగా తాత్కాలికంగా వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి సంబంధిత పోలీసులు సిద్దమయ్యారు. అనుమతి,సడలింపు ఉన్న వారితో పాటు ఈ-పాస్ పొందిన వారిని మాత్రమే రాకపోకలకు అనుమతించనున్నారు. ఎక్కడ పడితే అక్కడ..రయ్ మంటూ వెళ్లడానికి యువతకు ఇక బ్రేకులు పడ్డాయి. గతేడాది లాక్ డౌన్ సందర్బంగా ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను కట్టడి చేసే ఉద్దేశ్యంతో వారి వాహనాలకు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం జుర్మాణాలు విధించి వాహనాలను తిరిగి అందజేశారు. అయితే ఈసారి మొదటి నుంచి కొద్దిగా ఉదాసీనంగా వ్యవహరించడంతో యువకులతో పాటు కొంత మంది సీనియర్ సిటిజన్స్ సైతం రోడ్లపైకి వస్తున్నారు. దీంతో లాక్ డౌన్ అమలు జరుగుతున్నప్పటికీ.. ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలు తగ్గడం లేదు. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసు బాస్ బుధవారం వెంటనే స్పందించారు. ఆంక్షలను బేఖాతరు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సడలింపు సమయంలో కూడా సంబంధిత పోలీసు అధికారులు జనం రద్దీపై ద్రుష్టి సారించనున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉన్నప్పటికీ..జనం మాత్రం నెమ్మదిగా ఎనిమిది, తొమ్మిది గంటలకు మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోడ్లపై జనం గుంపులు,గుంపులుగా కనిపిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ఖరీదు లో ఏమాత్రం భౌతిక దూరం పాటించడం లేదు. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న నేపథ్యంలో సడలింపు ఉన్న 4 గంటలు కీలకంగా మారుతున్నాయి. సడలింపు సమయంలో పోలీసుల నిఘా కొరవడుతోంది. దీంతో వినియోగదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేని అసిమ్టమాటిక్ కరోనా వైరస్ రోగుల కారణంగా ఇతరులు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి. సడలింపు సమయంలో కూడా మాస్కులు ధరిస్తూ..భౌతిక దూరం పాటిస్తున్నారా..లేదా అనే విషయాలను పరిశీలించనున్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఇక నుంచి సడలింపు సమయంలో కూడా కరోనా కట్టడికి చర్యలు తీసుకోనున్నారు.

అనవసరంగా రోడ్లపైకొస్తే…వాహనాలను స్వాధీనం తప్పదు: డీజీపీ మహేందర్ రెడ్డి

సడలింపుల అనంతరం అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష ద్వారా పోలీసు అధికారులకు పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.ఎలాంటి సరైన అనుమతి పత్రాలు లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలు తప్పనిసరిగా కట్టడి చేయాలని ఆయన ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రోడ్డు పాటు అంతర్గత రోడ్లు వాహనదారులు రద్దీగా మారుతుందన్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర,నిత్యావసర పనులు కాకుండా సరదా కోసం రోడ్ల మీదకు వస్తే ఆయా వాహనాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవాలని ఆయన సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. లాక్ డౌన్ ముగిసే చివరి నిముషం వరకు ఎదురు చూడకుండా ఉదయం 9.45 గంటల నుంచే సైరన్ లను వినిపిస్తూ ప్రజలను వారి వారి ఇళ్లకు పంపే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ సడలింపు సందర్బంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచే తమకు కావలసిన నిత్యావసర వస్తువులతో పాటు ఇతర అత్యవసర పనులను పూర్తి చేసుకునే విధంగా సంబంధిత పోలీసులు చొరవ చూపించాలన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరును ప్రతిరోజు సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారన్నారు. 30వ తేదీ అనంతరం తిరిగి లాక్ డౌన్ ను పొడిగించకుండా ఉండాలంటే..ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా నిర్వహించాలన్నారు.