areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది..
 • కఠినతరమైన ఆంక్షలకు క్యాబినెట్ ఆమోదం తెలుప లేదు..
 • నో నైట్ కర్ఫ్యూ.. నో లాక్ డౌన్..
 • జోరుగా వాక్సినేషన్..
 • వైద్య ఆరోగ్య పరిస్థితులతో పాటు విద్య, వ్యవసాయ రంగాలపై క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు..
 • నేడు వరంగల్ లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన..

ఆర్సీ న్యూస్, జనవరి 18 (హైదరాబాద్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని క్యాబినెట్ తీర్మానించింది. నైట్ కర్ఫ్యూ  తో పాటు లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని క్యాబినెట్ భావించింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని అవసరమైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని క్యాబినెట్ కోరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్యాబినెట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. మంత్రి నివేదిక పై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది: మంత్రి హరీష్ రావు

 • రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై కేబినేట్ మొదటగా చర్చను ప్రారంభించింది. 
 • ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా కేబినేట్ కు వివరించారు. 
 • రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. 
 • రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగిందని, అర్హులైన అందరికీ అతి త్వరగా వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.  
 • మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకొని, వారితో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
 • వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రిని, అధికారులను ఆదేశించారు.
 • ఇందుకోసం అన్నిజిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సిఎం ఆదేశించారు. 
 • ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనా కట్టడికి సహకరించాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. 

నేడు సీఎం వరంగల్ పర్యటన..

 • అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి  పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది.  
 • ఈ మేరకు మంగళవారం నాడు సిఎం కెసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. 
 • సిఎం కెసిఆర్ వెంట వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. 

విద్యారంగంపై క్యాబినెట్ కీలక నిర్ణయం…

 • రాష్ట్రంలోని విద్య పై కేబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. 
 • ఇప్పటికే తెలంగాణ గురుకులాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది.
 • పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్ గుర్తించింది. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం..

 • . ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధనకు డిమాండు పెరుగుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అనివార్యత పెరిగిందని కేబినెట్ భావించింది. 
 • . వారి గ్రామాల్లో గనుక ప్రభుత్వమే ఇంగ్లీషు మీడియం లో విద్యాబోధన చేపట్టినట్టయితే  స్థానిక పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు గ్రామాల్లోని తల్లిదండ్రులు సంసిద్దంగా ఉన్నారని కేబినెట్ భావించింది. 
 • . ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియం లో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం కావలసిన అన్ని రకాల  మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.
 • . విద్యార్థులను ప్రాధమికస్థాయిలో ఇంగ్లీషు మీడియంలో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడామైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం,  వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
 • . నాణ్యమైన ఆంగ్ల విద్యను అందిచడం ద్వారా ప్రయివేట్ కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కేబినెట్ నిర్ణయించి ఈ మేరకు విద్యాశాఖను ఆదేశించింది. 
 • . ఇందులో భాగంగా  ప్రణాళికలను రూపొందించాలని విద్యాశాఖను కేబినెట్ నిర్ణయించింది.
 • . రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేట్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల వసూల్ల పై సర్వత్రా వ్యతరేకత వినవస్తున్నదనే విషయాన్ని కేబినెట్ చర్చించింది.
 • . ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి  విద్యను మరింతగా చేరువచేయాలని కేబినెట్ నిర్ణయించింది. 
 • . ఇందులో భాగంగా…ప్రయివేటు స్కూల్లు జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించేందుకు  నూతన చట్టాన్ని తేవాలని కేబినెట్ నిర్ణయించింది. 
 • . ఇందుకోసం పూర్తి స్థాయి అధ్యయనం చేసి విధి విధానాలను రూపకల్పన చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.
 • . తెలంగాణ రాష్ట్రంలో ‘మహిళా యూనివర్సిటీ ఏర్పాటు’ కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 • . తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో  ప్రతిపాదనలను సిద్దం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.
 • . ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టం రూపొందించాలని..వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై  ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది.
 • . ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, సంబంధిత విధివిధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది..సబ్ కమిటీ ఏర్పాటు…

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన…మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  

. రానున్న శాసన సభా సమావేశాల్లో ఫీజుల నియంత్రణకు  సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక  కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.