areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అక్టోబర్ 30న,హుజురాబాద్ ఉప ఎన్నిక

అక్టోబర్ 30న,హుజురాబాద్ ఉప ఎన్నిక
  • ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..
  • ఈటెల తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక
  • తన స్థానాన్ని దక్కించుకోవడానికి ఈటెల ప్రయత్నం..
  • తిరిగి పొందడానికి అధికార పార్టీ క్రుషి..
  • అన్ని పార్టీల చూపు హుజురాబాద్ వైపు..

ఆర్సీ న్యూస్, సెప్టెంబర్ 28 (హైదరాబాద్): హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు రానే వచ్చాయి. హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే,ప్రస్తుతం బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నో రాజకీయ పరిణామాలకు దారి తీసిన ఈ నియోజకవర్గంలో అక్టోబర్ మాసంలో ఉప ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులు హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పై దృష్టి సారించాయి. 

  • ఏ విధంగానైనా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తుండగా.. పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. 
  • నియోజకవర్గంలో తిష్ట వేసి కిందిస్థాయి కార్యకర్తల నుంచి ప్రధమ స్థాయి నాయకుని వరకు మంతనాలు జరుపుతున్నారు.
  • సమావేశాలు నిర్వహిస్తూ గత కొన్ని రోజులుగా రాజకీయ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 
  • ఇదిలా ఉండగా ఈటెల రాజేందర్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం అధికార టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోంది. 
  • స్వయంగా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగి పావులు కదుపుతున్నారు. 
  • హుజూరాబాద్ నియోజకవర్గం లో తమ పార్టీ ఇప్పటికే పటిష్టంగా ఉందని.. భావిస్తున్న అధికార పార్టీ స్థానిక ప్రజల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. 
  • ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాల పట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు అభ్యంతరాలు తెలుపడంతో.. వివాదాస్పదంగా మారాయి. 
  • అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజలకు అమలు చేస్తోంది.
  • ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కులాల వారికి దళిత బంధు పథకం పేరుతో అర్హులైన దళితులు అందరికీ పది లక్షల రూపాయ లను అందజేస్తోంది.
  • హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అటు ఈటెల రాజేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం తప్పు పట్టింది. 
  • ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే రాజకీయ నాటకాలు ఆడుతోందని.. టిఆర్ఎస్ పార్టీ పై దుమ్మెత్తిపోస్తున్నారు.
  • ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను లెక్కచేయని అధికార పార్టీ ముందస్తు ప్రణాళిక ప్రకారం నియోజకవర్గంలోని ఎస్సీ ప్రజలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోంది. 
  • ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఈటల రాజేందర్ బిజెపి పార్టీ తరఫున పోరాటం మొదలు పెట్టారు.
  • ఉప ఎన్నికకు దారి తీసిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే… 
  •  ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతూ వచ్చిన ఈటల రాజేందర్ పై ఏప్రిల్ 30వ తేదీన భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి.
  • ఓవైపు రాష్ట్రంలో కరోణ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉండగా.. మరోవైపు ఈటెల రాజేందర్ పై భూకబ్జాలు పేరుతో రాజకీయ దుమారం కొనసాగింది.
  •  జమున హ్యచరీస్ అసైన్డ్ ల్యాండ్ భూ వివాదం తెరపైకి వచ్చింది.
  •  దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ భూ వివాదం పై ఉన్నత స్థాయి విచారణ జరిపించారు.
  • మే ఒకటో తేదీన ఈటల రాజేందర్ ను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తొలగించారు.
  • మే రెండో తేదీన ఈటెల ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు.
  • మే మూడో తేదీన దేవర యంజాల్ లోని సీతా రామ స్వామి దేవాలయం భూకబ్జాలకు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
  •  జూన్ 12న, ఈటెల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
  • జూన్ 14న, ఈటెల బీజేపీలో చేరారు.
  • ఈ విధంగా ఈటెల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
  • దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ మాసంలో ఉప ఎన్నిక జరిగేటట్లు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
  • ఓవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తూ.. హుజురాబాద్ కు చేరుకోనుండగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
  • ఇక అధికార పార్టీ ఐన టిఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గం లో తిష్ట వేసి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది.

 ఉప ఎన్నిక షెడ్యూల్..

  • హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.
  • అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.
  • నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.
  • అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
  • అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.
  • నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు,  ఫలితాల ప్రకటన.