areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఎన్నికలప్పుడేనా.. ఎస్సీలు యాదికొచ్చేది..

ఎన్నికలప్పుడేనా.. ఎస్సీలు యాదికొచ్చేది..
  • ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న..
  • హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా కొత్త పథకాలు..
  • రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలందరికి దళిత బంధు అమలు చేయాలి
  • ఎస్సీల లాగే..ఎస్టీలకు కూడా మరో పథకం ఉండాలి
  • ఈ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకొ బుద్ది చెప్పనున్న ఓటర్లు

 

ఆర్సీ న్యూస్,ఆగస్టు 9 (ఆదిలాబాద్ ):  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో జరిగిన కాంగ్రెస్ సభలో తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఉత్సాహపరిచే విధంగా ఆయన ప్రసంగించారు. ఇంద్రవెల్లి సభ దాదాపు విజయవంతమైందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఇంద్రవెళ్లి అమరవీరుల స్థూపం వద్ద  నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎస్సీ, ఎస్టీ లంటూ డ్రామాలాడుతున్న కేసీఆర్ కు ఈసారి తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. దళిత బంధు పథకాన్ని కేవలం ఉప ఎన్నిక సందర్భంగా మాత్రమే తెర పైకి తీసుకు వచ్చిన కేసీఆర్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని విస్మరించారన్నారు. హుజురాబాద్ లో నిర్వహించనున్న ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కెసిఆర్ కు దళితులపై అభిమానం ఉంటే దళిత బంధు పథకాన్ని కేవలం హుజురాబాద్ నియోజకవర్గం లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలకు అమలు చేయాలన్నారు. హుజురాబాద్ లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసమే దళిత బంధు పథకాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. దళితులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్న సీఎం కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం తప్పదన్నారు. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కెసిఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీల జీవితాలు రోజురోజుకు మరింత దిగజారి పోతున్నాయన్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ కు  ఎస్సీలు గుర్తుకు వస్తున్నారని.. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే.. ఎంతో స్ఫూర్తి కలుగుతుందన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలిచ్చిన నేల ఇంద్రవెల్లి అని రేవంత్ రెడ్డి కొనియాడారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం గడ్డ ఇదే అన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాడారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్దేనని ఆయన హామీ ఇచ్చారు. గతంలో లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కుల మతాలకతీతంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎంతో మంది జాతీయ స్థాయి నేతలను ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ అందజేసిందన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పలు జిమ్ములకు పాల్పడుతోందన్నారు. కెసిఆర్ మోసాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని అప్పట్లో ప్రకటించిన కేసీఆర్… పార్టీ విజయం సాధించిన వెంటనే తానే ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. అంతే కాకుండా కేసీఆర్ ప్రభుత్వం మంత్రి వర్గంలో ఏ ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్క లేదన్నారు. గతంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యేకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన రెండున్నరేళ్ల కే మంత్రి వర్గం నుంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పటికీ కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో సభ నిండుగా కనిపించింది. టిఆర్ఎస్ పార్టీ తో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకున్న రేవంత్ రెడ్డి ఆ దిశలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారన్నారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆశయాలను కెసిఆర్ తొక్కేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. అడవి ని నమ్ముకున్న గిరిజనులను పోలీసులతో కొట్టిస్తున్నారన్నారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత బంధు లాగే ఎస్టి లకు కూడా మరో పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా ఈ సమావేశంలో మధుయాష్కిగౌడ్, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.