areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే..

  • అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుకు పూర్తిగా కేంద్రానిదే బాధ్యత..
  • విషయాలు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం బిజెపి నాయకులు మానుకోవాలి..
  • ఎవరి మెడలు ఉంచుతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలుసుకోవాలి..
  • ప్రగతి భవన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో సీఎం కేసీఆర్..

ఆర్సీ న్యూస్, నవంబర్ 07 (హైదరాబాద్): ఆహార ధాన్యాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత తో పాటు ధాన్యం కొనుగోలు విషయంలో వెనుకడుగు వేయరాదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనలేమని చెప్పడం జరిగింది…తప్పా రైతులకు నష్టం చేయాలని కాదని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు తో పాటు రైతులకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఈ విషయాలేవీ తెలియని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ఇది సరైంది కాదంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం.. అంటూ బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు ఎన్నోరకాలుగా తమ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపు తో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవు తోందన్నారు. రాష్ట్రాలలో పండిన పంటను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం సరైంది కాదని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని విమర్శించారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ, పంటల సాగు, పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.

ఈ విషయాలపై సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..”యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని నిన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే మంత్రి వివరించారు. కారణం ఏమిటంటే.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటోందని స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పడు రైతుల ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం కకావికలమైన పరిస్థితి ఉండేది. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మక పద్ధతిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని నిర్ణయించు కున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన అడుగులు వేసింది. ఆ ప్రక్రియలో మొదటి దశగా భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులను అభివృద్ధి చేశాం. ఆ తర్వాత నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశాం. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇచ్చాం. చిన్న రైతులు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయని రూ.1,400 కోట్లు వెచ్చించి.. రైతు బీమా పథకం ద్వారా రైతుల ప్రీమియం కూడా చెల్లిస్తున్నాం. విత్తనాలు కూడా దొరికేవి కావు, కల్తీ విత్తనాలు అమ్మేవారు. కేంద్రంతో పోరాడి, ఒప్పంచి కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు తెచ్చాం. ఎరువులు దొరికేవి కావు. పోలీస్‌ స్టేషన్‌లలో పెట్టి ఎరువులు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగింది. అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చేశాం. ఇలా అనేక చర్యలు చేపట్టాం. దీంతో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. కరోనా విపత్తు కాలంలో నెలల తరబడి రాష్ట్రంలో పండిన ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ’’ అని కేసీఆర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బాయిల్డ్ రైసు కొనుగోలు చేసేది లేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పిందన్నారు. ఇవన్నీ తెలియకుండా తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.‘‘బండి సంజయ్‌ ఎవరి మెడలు వంచుతారో చెప్పాలి. ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా? సంజయ్‌ వ్యక్తిగతంగా దుషించినా ఇన్నాళ్లు క్షమించాను. నా స్థాయి కాదని వదిలేశా. ఇప్పుడు తెలంగాణ రైతాంగం నష్టపోయే విధంగా మాట్లాడుతున్నారు’’ అని చెప్పారు. ఈ మేరకు యాసంగిలో వరి క్షేమం కాదని రైతులకు సీఎం సూచించారు