మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నా ఓటమికి 600 కోట్లు ఖర్చు చేశారు.

నా ఓటమికి 600 కోట్లు ఖర్చు చేశారు.
  • ఐనా హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ కు బుద్ధి చెప్పే విధంగా తీర్పునిచ్చారు..
  • ఇది ప్రజా విజయం..
  • ఉప ఎన్నికలో ప్రజలు కెసిఆర్ చెంప పగలగొట్టే తీర్పునిచ్చారు. 
  • 2023 ఎన్నికల్లో గానీ.. అంతకు ముందు వచ్చే ఎన్నికల్లో గానీ బిజెపిదే విజయం..
  • హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల ప్రమాణ స్వీకారం..

ఆర్సీ న్యూస్, నవంబర్ 10 (హైదరాబాద్): హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా తనను ఓడించడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూ. 600 కోట్లకు పైగా తన అక్రమ సంపాదన ఖర్చు చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించారన్నారు. తన విజయం ప్రజా విజయం అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు.అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణాస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి,కొండా విశ్వేశ్వర రెడ్డి,తుల ఉమ,ఏనుగు రవీందర్ రెడ్డి,సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన బిజెపి నాయకులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం ఒక ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించడానికి అక్రమ సంపాదన వినియోగించారన్నారు. అంతేకాకుండా దళిత బంధు పేరుతో రూ. 2500 కోట్లను ఖర్చు చేశారన్నారు. పదుల సంఖ్యలో మంత్రులను ఎమ్మెల్యేలను హుజూరాబాద్ నియోజకవర్గం లోకి పంపించి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని… ఎన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకున్న ప్పటికీ..అంతిమ విజయం తనకే దక్కిందన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గం ఓటర్ల అందరికీ రుణపడి ఉంటానన్నారు. హుజురాబాద్ లో జరిగిన ఫలితం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు హుజురాబాద్ ఉప ఎన్నికలతో ఒక అవగాహనకు వచ్చారన్నారు. 2023 లో జరిగే ఎన్నికలప్పుడైనా.. అంతకుముందు జరిగే ఎన్నికల అప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు గట్టిగా బుద్ధి చెప్పి బిజెపి పార్టీకి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కమలం వికసిస్తుంది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హుజురాబాద్ లో తమ పార్టీ ఘోరంగా పరాజయం పొందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంటలు గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. ఆయన ఎన్ని గంటలు మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని వారందరికీ మంత్రి పదవులు సైతం కట్టబెట్టడం తెలంగాణ ప్రజలను ఆవమానపరచడమే అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చివరి వరకు పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు ఇప్పటికైనా కేసీఆర్ ను వదిలిపెట్టాల్సిన అవసరముందన్నారు. మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు.. వీరందరికీ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ.. తనకు ఆ అవకాశాన్ని దూరం చేశారన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించకుండానే అడ్డుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఏది చెబితే అదే చట్టంగా మారుతుందన్నారు. దీనిని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటం చేస్తానన్నారు. బిజెపి  అధిస్థానం ఇచ్చే పిలుపు మేరకు పార్టీ అభివృద్ధి తో పాటు నిరసన కార్యక్రమాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తానన్నారు.