areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నా రాజీనామా తో లబ్ధి జరుగుతోంది…

నా రాజీనామా తో లబ్ధి జరుగుతోంది...
  • ప్రభుత్వ లబ్ధి పొందండి.. ఓట్లు నాకే వేయండి..
  •  ఏడేళ్ల లో ఇప్పటి వరకు అంబేద్కర్, జగ్జీవన్ రాం లకు పూలమాలలు వేయ లేదు..
  •  ఇప్పుడు దళితులు గుర్తుకు వచ్చారా..
  •  సీఎం కేసీఆర్ పై విరుచుకు పడిన ఈటెల రాజేందర్..
  • విలేకరుల సమావేశంలో ఈటెల..

 

ఆర్సీ న్యూస్, ఆగస్టు 25(హైదరాబాద్):  నా రాజీనామాతో హుజురాబాద్ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రాజీనామా చేసినందుకే గత ఏడేళ్లుగా ప్రజలను పట్టించుకోని సీఎం కేసీఆర్ ప్రస్తుతం అన్ని రకాల సంక్షేమ పథకాలను  ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయనవిలేకరులతో మాట్లాడుతూ… గతంలో ఇలాంటి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురాని ప్రభుత్వం ప్రస్తుతం తన రాజీనామా అనంతరం దళిత బందు తో పాటు వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. రేషన్ కార్డులు కావాలన్న వారికి… రేషన్ కార్డులు అందుతున్నాయి.. పింఛన్లు కావాలి అన్న వారికి పింఛన్లు అందుతున్నాయి..ఇదంతా తన రాజీనామా కారణం గానే జరుగుతున్నాయన్నారు. హుజురాబాద్ ప్రజలకు దళిత బంధువు పథకం అందుబాటులోకి వచ్చింది.. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అందరికీ అమలు జరిగితే రాష్ట్రంలో అందరికన్నా ముందుగా సంతోష పడేది తానేనని ఈటెల రాజేందర్ అన్నారు. తాను రాజీనామా చేసిన సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టానని..తాను లేవనెత్తిన అంశాలను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకొని అంచెలంచలుగా అమలు చేస్తున్నారన్నారు. దళిత బంధు పథకం.లాగే గిరిజన బంధు, వెనుకబడిన తరగతులకు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు దళిత బందు లాగనే సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. తాను ప్రశ్నించిన అనంతరమే సీఎంఓ ఆఫీస్ లో దళిత బిడ్డ కు పోస్టింగ్ లభించిందన్నారు. అలాగే ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా లింబాద్రి నీ నియమించడం.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా మరో దళిత బిడ్డకు అవకాశం దొరకడం.. హుజురాబాద్ కు మొట్టమొదటిసారిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్.. దళిత బిడ్డకు లభించడం…బిసి కార్పొరేషన్ చైర్మన్ గా హుజురాబాద్ కు చెందిన నాయకుడికి లభించడం.. ఇదంతా తాను సీఎం కేసీఆర్ ను నిలదీసినందుకే జరిగిందన్నారు. హుజురాబాద్ లో రాబోయే ఉప ఎన్నికలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రభుత్వం నుంచి అందే పథకాలను పొందుతూ… ఓట్లు మాత్రం తనకే వేయాలని ఈటెల రాజేందర్ కోరారు. ప్రస్తుతం భయంతో మాత్రమే టిఆర్ఎస్ పార్టీ కు ఓటు వేస్తామని హుజురాబాద్ ప్రజలు చెబుతున్నారని.. నిజానికి వారి గుండెల్లో తనకే ప్రాధాన్యత ఉందన్నారు. 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తనకు హుజురాబాద్ ప్రజలు తిరిగి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు. తాను గెలిస్తే తెలంగాణా ఆత్మ గౌరవం గెలుస్తుందన్నారు. తన గెలుపు అనంతరం పెను మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. రాజీనామా చేస్తేనే.. ఇన్ని సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఇక ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దళిత ఆఫీసర్లకు రాష్ట్రంలో మంచి చోటు లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దళితుల మీద ప్రేమతో ఇవన్నీ చేయడం లేదని.. తనను ఈ ఎన్నికల్లో ఓడించి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చారు అని ఆయన ఆరోపించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో పలు సర్వేలు నిర్వహిస్తున్నారని.. ఆయా సర్వేలలో సీఎంకు వ్యతిరేకంగా రిపోర్టులు వస్తున్నాయన్నారు. తన పై విజయం సాధించడం కోసం నీచపు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఏడేళ్లలో ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఎప్పుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో పాటు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించ లేదన్నారు. ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న విగ్రహానికి సైతం ఇప్పటివరకు పూలమాల వేయని సీఎం కేసీఆర్ కు ప్రస్తుతం దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది అన్నారు. సీఎం కేసీఆర్ చూపిస్తున్న ప్రేమను హుజురాబాద్ ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది ఉప ఎన్నికల్లో తననే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈటెల రాజేందర్ తోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.