areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఈనెల 23 వరకు టైమ్ ఇస్తాం..

రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఈనెల 23 వరకు టైమ్ ఇస్తాం..
  • తర్వాత రైతులు అందరితో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తాం.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలాడుతున్నాయి.
  • రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం..
  • ఏసీల నడుమ ధర్నా చేయడం ఏమిటో కేసీఆర్ కే తెలియాలి..
  • రైతుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన సిద్దిపేట కలెక్టర్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా..
  • రైతులకు వ్యతిరేకంగా మాట్లాడితే పదవులను కట్టబెడతారా..
  • నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి..

ఆర్సీ న్యూస్, నవంబర్ 18 (తెలంగాణ): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు రెండు దొంగ నాటకాలు ఆడుతున్నాయన్నారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనేంతవరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ నుంచి బషీర్ బాగ్ లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించింది. పార్టీ సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అర్థం పర్థం లేని సమస్యలను సృష్టించి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తానే స్వయంగా ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏపీలను ఏర్పాటు చేసుకుని వాటి మధ్య కాసేపు కాలక్షేపం చేసినట్లు ధర్నా నిర్వహించడం.. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు విజ్ఞాపన పత్రం సమర్పించడం తదితర కార్యక్రమాలను చూస్తుంటే ఇదంతా కేసీఆర్ డ్రామా గా కనిపిస్తుందన్నారు. రైతుల సమస్యలను నిజంగా పరిష్కరించాలి అనుకుంటే..ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని..ఇందులో మీ పార్టీ తరఫున మీ కార్యాచరణ ఏమిటో తెలంగాణ రైతుల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ని సైలెంట్ చేయడానికి మాత్రమే ఓవైపు బిజెపి మరోవైపు టిఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నారన్నారు. మద్యం దుకాణాల కేటాయింపు కోసం దరఖాస్తుల ద్వారా డిపాజిట్ల రూపంలో 12 వేల కోట్ల రూపాయలు వచ్చాయని.. తిరిగి చెల్లించని ఈ డబ్బుతో రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఖరీదు చేయవచ్చుననీ ఆయన అన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడితే.. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అతనికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం రైతుల పట్ల కెసిఆర్ కు ఉన్న ప్రేమ ఏపాటిదో తెలుస్తుందన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల లోని నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు గ్రామాలలోని కల్లాలకు వెళ్లి పరిస్థితులను పరిశీలించాలన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ తో కలిసి తాను శుక్రవారం కామారెడ్డి కి వెళ్లి ఆయా కల్లాలను సందర్శించి అక్కడి రైతులను పరామర్శించనున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోకపోతే కెసిఆర్ కు నిద్ర పట్టనివ్వమని ఆయన హెచ్చరించారు. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రైతుల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్రలు చేస్తూ.. రైతులకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీలు వీధి భాగోతం ఆడుతున్నాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి  చిన్నారెడ్డి, టి పి సి సి కార్యదర్శి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.