areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు..అంతా సిద్దం

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు..అంతా సిద్దం
  • ఈటెల తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జరుగుతున్న ఉప ఎన్నిక
  • తన స్థానాన్ని దక్కించుకోవడానికి ఈటెల ప్రయత్నం..
  • తిరిగి పొందడానికి అధికార పార్టీ క్రుషి..
  • అందరి చూపు హుజురాబాద్ వైపు..
  • పోటా పోటీగా ఎన్నికల ప్రచారం..
  • ఈనెల 30న, పోలింగ్…
  • వచ్చే నెల 2 లెక్కింపు,.ఫలితం వెల్లడి..

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 27 (హైదరాబాద్): హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఈనెల 30న, పోలింగ్ జరుగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బుధవారం వరకు జోరుగా ఎన్నికల ప్రచారం జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు పోలింగ్ రానే వచ్చింది. హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే,ప్రస్తుతం బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నో రాజకీయ పరిణామాలకు దారి తీసిన ఈ నియోజకవర్గంలో అక్టోబర్ 30న, ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులు హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పై దృష్టి సారించి విస్త్రుతంగా ప్రచారం నిర్వహించారు. ఏ విధంగానైనా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తుండగా.. పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో తిష్ట వేసి కిందిస్థాయి కార్యకర్తల నుంచి ప్రధమ స్థాయి నాయకుని వరకు ఏకం చేసి ప్రచారం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా నిర్వహించిన రాజకీయ ప్రచారం ముగిసింది. ఈటెల రాజేందర్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం అధికార టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోంది.  స్వయంగా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగి పావులు కదిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో తమ పార్టీ ఇప్పటికే పటిష్టంగా ఉందని.. భావిస్తున్న అధికార పార్టీ స్థానిక ప్రజల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాల పట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు అభ్యంతరాలు తెలుపడంతో.. వివాదాస్పదంగా మారాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజలకు అమలు చేసింది. ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కులాల వారికి దళిత బంధు పథకం – ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను లెక్కచేయని అధికార పార్టీ ముందస్తు ప్రణాళిక ప్రకారం నియోజకవర్గంలోని ఎస్సీ ప్రజలకు దళిత బంధు పథకాన్ని అమలు చేసింది.  ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఈటల రాజేందర్ బిజెపి పార్టీ తరఫున పోరాటం మొదలు పెట్టి జోరుగా ప్రచారం నిర్వహించారు.

కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ..

గత నెల 28 న కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఎలక్షన్ కు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోనికి వచ్చినది. కరీంనగర్ కమిషనరేట్ మరియు వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో  ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు,  10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 MCC మరియు 10 VST లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నాము. తనిఖీల్లో భాగంగా, ఇప్పటివరకు వేర్వేరు సందర్భాలలో రూ. 3,29,36,830 లను, రూ. 6,36,052 విలువగల 944 లీటర్ల మద్యమును, రూ.69,750  విలువగల 11.4 కేజి లు గంజాయిని, రూ.44,040  విలువగల పేలుడు పదార్థాలను, రూ. 2,21,000 విలువగల చీరలు, చొక్కాలను రూ. 10,60,000  విలువగల, బంగారం, వెండి ఆభరణాలను వీటి అన్నింటి విలువ రూ.3,49,63,679  గల వాటిని స్వాధీనపరచుకొని చర్యలు తీసుకున్నామని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు.ఇప్పటి వరకు  అల్లరి సృష్టించే 2,284 మంది వ్యక్తులను గుర్తించి తహశీల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగింది. బైండోవర్ నియమావళి ఉల్లంఘించి మళ్ళీ నేరానికి పాల్పడిన ఎల్కపల్లి సంపత్ అనే వ్యక్తిని ఉల్లంఘన నేరం క్రింద అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది.ఇప్పటి వరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘన క్రింద వివిధ పార్టీల పై 116 కేసులు నమోదు చెయ్యడం జరిగింది. నేటితో అనగా తేదీ 27-10-2021. రాత్రి 07-00 గంటల సమయానికి ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. కావున కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రచార గడువు ముగిసిన తరువాత స్థానికేతర వ్యక్తులు ఆ నియోజక వర్గం ను వదిలి వెళ్ళిపోవలెను లేనిచో కఠిన చర్యలు తీసుకోబడును మరియు నేటి రాత్రి 07-00 నుంచి ఎన్నికలు ముగిసే వరకు గల 72 గంటలు కాలాన్ని నిశ్శబ్ద కాలంగా కేంద్ర ఎన్నికల సంఘం విధించింది. (2) Addl DCsP, (15) ACsP, (65) CI , (180) SI మరియు 2000 మంది సిబ్బంది మరియు 22 కంపెనీల కేంద్ర మరియు రాష్ట్ర సాయుధ బలగాలతో ధCP  సత్యనారారణ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.