ఏప్రిల్ 12, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కేసులకు భయపడం..దమ్ముంటే రైతుల వరి కొనండి..

కేసులకు భయపడం..దమ్ముంటే రైతుల వరి కొనండి..
  • వరి ధాన్యం కొనాలంటూ టిఆర్ఎస్ మహా ధర్నా..
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ..
  • మహా ధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్..
  • కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టిన సీఎం కేసీఆర్..
  • రైతులు పండించిన వరి ధాన్యం కొనకపోతే పెద్ద ఎత్తున ఆందోళన..
  • దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించడానికి ముందుంటాం..
  • వరి ధాన్యాన్ని కొంటారా కొన్నారా సూటిగా చెప్పండి.. అంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన కేసీఆర్..

ఆర్సీ న్యూస్, నవంబర్ 18(హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం లోని రైతుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని.. ఇది సరైన పద్ధతి కాదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ రాష్ట్రంలోని రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి కుంటి సాకులు చెబుతోందన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మార్పులు రాకపోతే రైతులు, రైతు సంఘాలతో పాటు అన్ని పార్టీలను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించడానికి తాము ముందు ఉంటామన్నారు. ఆందోళన చేయడంలో తమకు ఎవరు సాటిరారన్నారు. టిఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు బెదరదనీ.. కేసులు పెడతామంటే భయపడమని సీఎం కేసీఆర్ అన్నారు. తాము దీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తాము కేంద్ర ప్రభుత్వం బెదిరించే బెదిరింపులకు బెదిరి పొమన్నారు. తమకు పదవులు లెక్క కాదని.. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులను సైతం లెక్క చేయకుండా రాజీనామాలు చేశామన్నారు. తాము తలుచుకుంటే రైతుల సమస్యలను పరిష్కరించేంత వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలి పెట్టమన్నారు. కల్లబొల్లి కబుర్లు చెబుతూ రైతులను కష్టాలకు గురి చేయడం సరైంది కాదన్నారు. మా ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?..అని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సూటి ప్రశ్న వేశారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదని.. పండించిన పంట కొంటారా.. కొనరా? అనే అడుగుతున్నారన్నారు. కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. రైతుల గోస తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెరాస ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండ గట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

” ఏడాదిగా దేశ వ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు. సాగు చట్టాలు వద్దని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వరా? నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తోంది. దేశంలో 40 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి. అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. బంగారం పండే భూములను నిర్లక్ష్యం చేస్తున్నారు. భారత్‌ ఆకలి రాజ్యమని ఆకలి సూచీలో వెల్లడైంది. ఆకలి సూచీలో పాకిస్థాన్‌ కంటే దిగువన భారత్‌ ఉంది. ఉత్తర భారత రైతులు దిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మేం తెచ్చిన సాగు విధానాలతో రైతులోకం ఓ దరికి వచ్చింది. దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పని చేయడం లేదు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. కేంద్రం తీరుతోనే ఇష్టం లేకున్నా ధాన్యం సాగు వద్దని చెప్పాం. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయమని కోరాం. దిష్ఠి తీసి భాజపా కార్యాలయంపై కుమ్మరిస్తాం. మా ఓపికకు ఓ హద్దు ఉంది. ప్రధానిని చేతులు జోడించి ఒకటే మాట అడుగుతున్నా.. వడ్లు కొంటారా? కొనరా?. దీనిపై ఆయనకు నిన్న లేఖ రాశా. దేశంలోని రైతు సమస్యలపై తెరాస నాయకత్వం తీసుకుంటుంది. ధాన్యం కొంటామని ఇప్పటి వరకు కేంద్రం హామీ ఇవ్వలేదు. యాసంగిలో ధాన్యం వద్దని చెబితే వేయాలని భాజపా అంటోంది. కేంద్రం ధాన్యం తీసుకోకపోతే దిష్టితీసి భాజపా కార్యాలయంపై కుమ్మరిస్తాం. దేశ రైతుల సమస్యల పరిష్కారం కోసం నేతృత్వం వహిస్తాం. రాష్ట్ర సాధనలో పదవులను తృణ ప్రాయంగా వదులుకున్నాం. ఎన్నికలు వచ్చి నప్పుడల్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ వంటి నాటకాలు బయటికొచ్చాయి.. ప్రజలకు తెలిశాయి

కేసీఆర్‌ వచ్చాక విద్యుత్ సమస్య ఎలా పరిష్కారమైంది? సమర్థత ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. ఎప్పుడూ 2లక్షల మెగావాట్లు మించి వాడలేదు. మన రాష్ట్రంలో తప్ప నిరంతర విద్యుత్‌ ఎక్కడా ఇవ్వట్లేదు. ఇది ఎవరి చేతగానితనం.?ఎవరి అసమర్థత?విద్యుత్ ఇవ్వడం చేతకాక మోటార్లు పెడతామంటారు. రాష్ట్రంలో మీటర్లు ఉండవు.. నీటి తీరువా లేదు’’ అని కేసీఆర్‌ అన్నారు. ధర్నా అనంతరం సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.